రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్లో కమలం వికసిస్తుందని ఇందూరు గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని 43, 52, 28, 51, 14 మరియు 15వ డివిజన్ లలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ… నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ప్రపంచం లోని అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఆర్థికంగా చతికిలబడిపోయాయని, ఆ దేశాల్లో జీవిస్తున్న ప్రజల ప్రాణాలకు రక్షణ కూడా లేకుండా పోయిందని అన్నారు.
కానీ మోడీ నాయకత్వంలో ఉన్న భారతదేశం తిరుగులేని శక్తిగా విశ్వగురువుగ ఎదుగుతుందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశభక్తి ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మం రోజురోజుకు పెరుగుతున్నాయని భారతీయులంతా బిజెపి వైపు ముగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సాధించిన తిరుగులేని విజయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇంటింటికి మంచినీరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు రేషన్ కార్డులు ఇలా ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, కానీ అంతా తామే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ రెండూ కూడా కుటుంబ పార్టీలేనని, నిజమైన ప్రజాస్వామ్యంతో నడిచే బిజెపి పార్టీ మాత్రమే సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో పనిచేస్తుందని అన్నారు.
గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ కేవలం రెండు, మూడు సీట్ల తేడాతో కార్పొరేషన్ సీటు కోల్పోయామని, అనైతిక హక్కులతో మేయర్ పీఠం దక్కించుకున్న ఎంఐఎం, టిఆర్ఎస్ నగరానికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి తిరుగులేని విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని, నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ధన్ పాల్ దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ గారు పాల్గొన్నారు.
