విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను (స్కిల్ డెవలప్మెంట్) పెంపొందించుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థులు కళాశాల దశ నుంచే నైపుణ్యాలపై పట్టు సాధిస్తే, క్యాంపస్ ఇంటర్వ్యూలలో సులభంగా విజయం సాధించవచ్చని సూచించారు. నేటి యువతే రేపటి తరాలకు మార్గదర్శకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇలాంటి మరిన్ని శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తాహిర్ బిన్ హందాని, అల్జాపూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నూడ చైర్మన్ కేశవ వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.
