సమాజంలో నా అనేవారు లేని అనాథలు మరణించినప్పుడు, వారికి అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించడం నిజమైన మానవత్వానికి నిదర్శనమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతీ లక్ష్మి కొనియాడారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 168 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం వారి సేవా నిరతికి అద్దం పడుతోందని ఆమె పేర్కొన్నారు.
గురువారం గంగస్థాన్ ఫేజ్-1లోని యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ హాల్‌లో నిర్వహించిన ‘మానవత సేవ-2026’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. “మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఇందూరు యువత సంస్థ నిజం చేస్తోంది.
అనారోగ్యంతో మరణించిన అనాథలకు పాడె మోసి, తలకొరివి పెట్టి, సొంత మనుషుల కంటే మిన్నగా బాధ్యతను నిర్వర్తించడం గొప్ప విషయం. కేవలం అంత్యక్రియలతోనే ఆగకుండా, వారి అస్థికలను సేకరించి కాశీలో శాస్త్రోక్తంగా పిండప్రదానం చేయడం నిజమైన భగవంతుడి సేవ” అని ప్రశంసించారు.
సంస్థ వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు గత 15 ఏళ్లుగా తన జీవితాన్ని సేవకే అంకితం చేయడం అందరికీ ఆదర్శనీయమని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీన కాశీలో అనాథల అస్థికలను కలిపి పిండప్రదానం చేసే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, యూవీ ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్, సంస్థ కార్యవర్గ సభ్యులు జయదేవ్ వ్యాస్, మద్ది గంగాధర్, సుజాత రెడ్డి, దర్శనం రాజు, బోడ హనుమడ్లు, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
