ఎవరూ లేని అనాథ శవాలకు ఆత్మబంధువులై అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న ‘ఇందూరు యువత’ స్వచ్ఛంద సేవా సంస్థ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసిన 168 మంది అనాథల అస్థికలను పుణ్యక్షేత్రమైన కాశీకి తీసుకెళ్లి, గంగానదిలో నిమజ్జనం చేశారు. ఆదివారం కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా సామూహిక పిండప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
లోకం ‘శవం’ అని అసహ్యించుకుని, కుళ్లిపోయిన దేహాలను చూసి ముక్కు మూసుకుని తప్పుకుంటున్న తరుణంలో.. ఆ దేహాల్లో దైవాన్ని చూస్తున్నామని ఇందూరు యువత ప్రతినిధులు పేర్కొన్నారు. కన్నబిడ్డలు సైతం వెనకడుగు వేసే చోట, తామే భుజంపై పాడె మోస్తూ, తలకొరివి పెట్టి, తలనీలాలు సమర్పించి ఒక బిడ్డగా చేయాల్సిన ప్రతి బాధ్యతను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ.. తాము కేవలం సేవ చేయడం లేదని, అంతరించిపోతున్న మానవత్వానికి ప్రతిరోజూ ఊపిరి పోస్తున్నామని భావోద్వేగానికి లోనయ్యారు. అనాథల ఆత్మలకు సద్గతి కలగాలనే ఉద్దేశంతోనే కాశీలో ఈ పుణ్య కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దర్శనం రాజు, ఇందూరు శేఖర్, గంగారాం, గండ్లా విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. అనాథల పట్ల ఇందూరు యువత చూపుతున్న ఈ నిరుపమాన సేవపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
