నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఈ స్టేషన్ నుండి ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్ఐలు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ.. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రదర్శించిన నిబద్ధతను కొత్త చోట కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.
పోలీస్ శాఖలో బదిలీలు సహజమని, ఎక్కడ పనిచేసినా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బదిలీపై వెళ్తున్న ఎనిమిది మంది సిబ్బందిని సీఐ, ఎస్ఐలు శాలువాలతో కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
అనంతరం వారికి జ్ఞాపికలను అందజేసి వీడ్కోలు పలికారు. తోటి సిబ్బంది తమతో పంచుకున్న అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
