రోడ్డు ప్రమాదాల నివారణకు ఉద్యమంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం . నిజామాబాద్ జిల్లా పౌరుల భద్రతే లక్ష్యంగా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల సమన్వయంతో రూపుదిద్దుకున్న ‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
నగరంలోని జిల్లా మెడికల్ కళాశాల వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్‌గా సీపీసాయి చైతన్య, కన్వీనర్‌గా అదనపు డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రటరీగా కవితా రెడ్డితో పాటు ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధానంగా మహిళా,చిన్న పిల్లల రక్షణ, ట్రాఫిక్ భద్రత, మౌలిక సదుపాయాల రక్షణ, సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారిస్తుంది. కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, గృహ సంఘాలు మరియు వ్యాపార వర్గాలను భాగస్వాములను చేస్తూ.. నగరాన్ని సురక్షితమైన గమ్యస్థానంగా మార్చడమే దీని అంతిమ ఉద్దేశం.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్, సైబరాబాద్ తరహాలో నిజామాబాద్‌లో కూడా ఇటువంటి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. “ప్రస్తుతం 8 ప్రధాన విభాగాలతో ఈ కౌన్సిల్ పని చేస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
గతంలో జుమ్మారాత్ బజార్‌లో దొంగలించిన సొత్తు అమ్మేవారు, ఇప్పుడు ‘డార్క్ వెబ్’ అటువంటి అడ్డాగా మారింది. ఆధార్, క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి మోసగిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి” అని సూచించారు.
*హత్యల కంటే ప్రమాద మరణాలే ఎక్కువ!* రోడ్డు భద్రతపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏటా సగటున 800 హత్యలు జరుగుతుంటే, కేవలం రోడ్డు ప్రమాదాల్లో సుమారు 7,000 మంది మరణించడం విచారకరమన్నారు.అందుకే ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు కేవలం డ్రైవర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలనీ అన్నారు.
కార్లలో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఓవర్ టేకింగ్ ఎప్పుడూ కుడి వైపు నుంచే చేయాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు పరిసరాలపై దృష్టి సారించాలని కోరారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి, కౌన్సిల్ సభ్యులు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
