శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నూతనంగా నిర్మించిన నిజామాబాద్ గ్రామీణ (రూరల్) పోలీస్ స్టేషన్ మరియు మాక్లూర్ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, భూపతిరెడ్డి మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అధునాతన సౌకర్యాలతో పోలీస్ స్టేషన్లు నూతన భవనాలను పరిశీలించిన డీజీపీ, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ ద్వారా నేర నియంత్రణలో మరింత వేగం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీ మరియు అతిథులు పాల్గొని వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. “ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. ప్రాణరక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెల్మెట్లు ధరించి పాల్గొని, ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సిపి మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
