రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ ధ్వజమెత్తారు.
పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సుమారు 20 లక్షల మంది విద్యార్థుల చదువులు ప్రమాదంలో పడ్డాయి. నిధుల విడుదల లేక ఏటా 2 లక్షల మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేస్తుండగా, మరో 4.5 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల ముందు ‘గ్రీన్ ఛానెల్’ ఏర్పాటు చేసి ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తూ కూడా బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం.
హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడం, లాఠీఛార్జీలకు పాల్పడటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.
14న జరిగే బంద్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ సమీర్, జోనల్ ఇంచార్జి దుర్గ, మోహన్, లెనిన్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
