రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రేషనలైజేషన్ పేరుతో 23 వేల పాఠశాలలను మూసివేసేందుకు కుట్ర చేస్తోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మండిపడింది.
ఈ మేరకు సోమవారం (జూన్ 23) రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడీకి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా పాఠశాలల మూసివేతకు కంకణం కట్టుకుందని విమర్శించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని, వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే చట్టాన్ని అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బ్రాంచీలు నిర్వహిస్తూ వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, నాణ్యమైన భోజనం అందించాలి. పాఠశాలలు తెరిచినా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
అలాగే అన్ని పాఠశాలల్లో ‘బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం దిగిరాకపోతే, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని అక్షయ్ హెచ్చరించారు.
