అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడుల సేకరణడబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులులడ్డూ వేలంతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని.. అధిక లాభాల పేరుతో భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
నగరంలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ మై హోమ్ భూజాలో ఐదుగురు నివాసితుల నుంచి దాదాపు రూ.3.45 కోట్ల మేర పెట్టుబడులు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మై హోమ్ భూజాలో నిర్వహించిన లడ్డూ వేలంలో కొండపల్లి గణేష్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నట్లు బాధితులు తెలిపారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని అపార్ట్‌మెంట్ వాసులకు పంపిణీ చేయడంతో వారితో పరిచయం పెరిగిందని పేర్కొన్నారు.
ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించినట్లు ఆరోపించారు. వారి మాటలు నమ్మిన అపార్ట్‌మెంట్‌కు చెందిన ఐదుగురు నివాసితులు విడతల వారీగా మొత్తం రూ.3.45 కోట్లు పెట్టుబడిగా ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొంతకాలం తర్వాత లాభాల గురించి అడగడంతో నిందితులు స్పందించకపోవడంతో అనుమానం వచ్చినట్లు బాధితులు తెలిపారు. పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరినా స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు చెల్లించిన మొత్తాలు, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. సేకరించిన డబ్బు ఎక్కడికి మళ్లింది? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
