సోదరభావంతో, మతసామరస్యంతో పండుగ జరుపుకోవాలని పిలుపుత్యాగానికి, భక్తికి ప్రతీక అయిన బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పర్వదిన వేడుకలు ముస్లింల భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి.
గురువారం ఉదయం నుంచే నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్లిం జనవాహినితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నూతన వస్త్రాలు ధరించిన చిన్నపెద్ద తేడా లేకుండా ముస్లిం సోదరులంతా నగరంలోని ముజాహిద్ నగర్ లోని ప్రధాన ఈద్గా (ఈద్గా-ఎ-జదీద్), గాంధీ చౌక్ సమీపంలోని ఈద్గా, బోధన్ రోడ్డులోని మదీనా ఈద్గా, కంఠేశ్వర్, అర్సపల్లి ఈద్గాలతో పాటు ప్రధాన మసీదులకు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ సమర్పించారు.
సమాజంలో శాంతిసామరస్యాలు విరసిల్లాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రత్యేక దుఆ చేశారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ అంటూ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పండగ వేళ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో బందోబస్తును పర్యవేక్షించారు.
నగరంలోని అత్యంత కీలకమైన గాంధీ చౌక్ పరిసర ప్రాంతాలు, ముజాహిద్ నగర్ ప్రధాన ఈద్గాతో పాటు వివిధ మసీదుల వద్దకు వెళ్లిన సీపీ.. అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు నిఘాను, భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగరం ఎల్లప్పుడూ గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి, మతసామరస్యానికి ప్రతీక అని, ప్రజలందరూ అదే సోదరభావంతో కలసిమెలసి పండగను జరుపుకోవాలని ఆయన కోరారు.
ఎక్కడా ఎలాంటి చిన్నపాటి పొరపాట్లు లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలంతా పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మానవులంతా ఒక్కటేనని నమ్మాలి. బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక. ఖుర్బానీ అంటే జంతుబలి కాదు, మానవుడు దైవమార్గంలో తన సర్వస్వాన్ని త్యజిస్తానని చేసే ప్రకటన మాత్రమే.
దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒకటేనని నమ్మాలి. చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాలలో సహనం వహిస్తూ, త్యాగ నిరతిని చూపించాలన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉంది.– అబ్దుల్ రెహమాన్ జిల్లా అధ్యక్షుడు
