నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పైడిమాల గ్రామ శివారులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గైని సాయిలు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాయిలు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచివేసింది. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
