- మోదీ అమిత్ షా కు కనువిప్పు కలిగేలా కామారెడ్డి సభ
- దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు
- బండి సంజయ్ ఉదయం లేస్తే దేవుళ్ళ చుట్టూ తిరిగి ఓట్లు అడుక్కుంటారు
- బిజేపి నేతల మాదిరి ఓట్లు అడుక్కోలే
- లిక్కర్ రాణిగా నిజామాబాద్ కి కవిత చెడ్డ పేరు తీసుకొచ్చారు
- వాటాల పంపకాల్లో తేడాల వల్లే కేసిఆర్ కుటుంబంలో కొట్లాట
ఈనెల 15వ తేదీన కామారెడ్డి వేదికగా జరగనున్న బహిరంగ సభ సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిపక్షాల భరతం పట్టే వేదికగా ఈ సభ నిలుస్తుందని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కామారెడ్డి సభ ద్వారా కేంద్రం దిగి రాక తప్పదని ఆయన హెచ్చరించారు. మోదీ, అమిత్ షాలకు కనువిప్పు కలిగించేలా ఈ సభ జరగబోతోందని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు “దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న బిచ్చగాళ్ళ్లా మారిపోయారు. బండి సంజయ్ ఉదయం లేస్తే దేవుళ్ల చుట్టూ తిరిగి ఓట్లు అడుగుతారు. దేశ్ ముఖ్ మాటకు కట్టుబడి ఉన్నాను.
సెక్యూరిటీ లేకుండా రావడానికి దమ్ముందా? బీసీ రిజర్వేషన్లపై దొంగాట ఆడుతున్నారు” అని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ముఖం చాటేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్‌పై కూడా తీవ్ర స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. “కవిత లిక్కర్ రాణిగా నిజామాబాద్‌కు చెడ్డపేరు తెచ్చారు. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠా. రాష్ట్రాన్ని దోచుకున్నామని కవిత స్వయంగా అంగీకరించటం హర్షణీయమని, కానీ ఐదేళ్ళ ముందే చెబితే సన్మానించేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని తేల్చి చెప్పారు. దోచుకున్న సొమ్ములో వాటాల పంపకాల్లో తేడాల వల్లే కేసిఆర్ కుటుంబంలో కుమ్ములాటలు అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సమానత్వానికి మారు పేరు అని టీపిసిసి చీఫ్ పేర్కొన్నారు. “కార్యకర్తల కృషివల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఆశయమైన ఎవరు ఎంతో వారి వాటా వారికంత నినాదానికి సీఎం రేవంత్ రెడ్డి ఊపిరి పోశారు” అని తెలిపారు. కుల సర్వేలో 56.33 శాతం బీసీలు ఉన్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
