సవాళ్లు ప్రతిసవాళ్ళతో కాంగ్రెస్ బీజేపీ ల మధ్య మాటల యుద్ధం తో ఆర్మూర్ రాజకీయం హీటెక్కింది.కాంగ్రెస్–బీజేపీ మధ్య రాజకీయ పోరు అంకాపూర్ వేదికగా మారింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఛలో అంకాపూర్ ఫై పోలీసు శాఖ అప్రమత్తం అయింది.
అర్ద రాత్రి నుంచి రంగంలోకి దిగిన పోలీసులు అంకాపూర్ ను మోహరించారు అధికార పార్టీ నేతలెవ్వరూ ఆ గ్రామానికి వెళ్లకుండా ఎక్కడిక్కడే కట్టడి చేసారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టింది. అంకాపూర్‌లోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చలో అంకాపూర్’ పిలుపు మేరకు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డిని పోలీసులు ఆయన నివాసంలోనే హౌస్ అరెస్టు చేశారు.
అలాగే కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలను కూడా వివిధ ప్రాంతాల్లో ముందస్తుగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంకాపూర్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ఇందుకోసం ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను భారీ ఎత్తున సమీకరించే ప్రయత్నాలు చేపట్టింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ‘చలో అంకాపూర్’కు పిలుపునిస్తూ గత ఎన్నికల్లో రాకేష్ రెడ్డి ఇచ్చిన వ్యక్తిగత హామీలను గుర్తు చేశారు.
ముఖ్యంగా స్వంత ఖర్చులతో ఇళ్లు నిర్మించి ఇస్తానని, ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తానని చెప్పిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
దీనికి బీజేపీ కూడా అదే స్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ నాయకులు అంకాపూర్‌కు వస్తే గట్టిగా ఎదుర్కొంటామని, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి అండగా ప్రతి కార్యకర్త నిలవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పిలుపునిచ్చారు. రాకేష్ రెడ్డి జోలికి వస్తే తాము కూడా దీటుగా స్పందిస్తామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘చలో అంకాపూర్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా స్పందిస్తూ స్వాగతించారు. తన స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వస్తే అంకాపూర్‌లో బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తనకంటే తక్కువ స్థాయి నాయకులతో చర్చ అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఇటీవల నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ నిర్వహించిన బీజేపీ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుల మోటార్ షోరూంలను దోచుకుని స్కూటీలు తీసుకెళ్లాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్ నాయకులు అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ ‘చలో అంకాపూర్’ కార్యక్రమాన్ని ప్రకటించారు.ఈ పరిణామాలతో గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క జిల్లా పర్యటన ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసు శాఖ అప్రమత్తమైంది.
రాజకీయ వివాదం శాంతిభద్రతల సమస్యగా మారకుండా అంకాపూర్‌తో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీ పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది.
