నిజామాబాద్ నాగారం 80 క్వార్టర్స్ ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ప్లాట్ క్రయవిక్రయాలకు సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాల మధ్య ఒక మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అజీమ్, కరీమ్ అనే వ్యక్తుల మధ్య ప్లాట్ లావాదేవీలు నడిచాయి. కరీమ్ అనే వ్యక్తి అజీమ్‌కు ఒక ప్లాట్ విక్రయించాడు. అయితే ఆ ప్లాట్ సరిగ్గా లేదని భావించిన కొనుగోలుదారుడు, తిరిగి తన డబ్బులు తనకు ఇవ్వాలని లేదా వేరే స్థలం చూపించాలని కోరగా… ఈ విషయమై గతంలోనూ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో కరీమ్,అజీమ్ ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఈ ఇద్దరు మద్య గొడవ సందర్భంగా ఆమె కింద పడిపోవడంతో పాటు తీవ్ర ఆందోళనకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల పై పోలీసులను వివరణ కోరగా పూర్తి సమాచారం సేకరించి తదుపరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
