జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను ఏమాత్రం సహించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇసుక తవ్వకం, రవాణా పూర్తిగా మన ఇసుక వాహనం (ఆన్‌లైన్) బుకింగ్ విధానం ద్వారా మాత్రమే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ వే బిల్లులు లేదా అనుమతులు ఇవ్వకూడదని తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆన్‌లైన్ పర్మిట్‌లు లేకుండా ఇసుక రవాణా చేసినట్లయితే సంబంధిత వాహనాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఇటీవల సాలూర మండలంలో రెండు అక్రమ ఇసుక రవాణా వాహనాలు పట్టుబడిన ఘటనలను తీవ్రంగా పరిగణించి, సంబంధిత తహసీల్దార్ కు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరడం జరిగిందన్నారు.
ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేసినచో సంబంధిత తహసీల్దార్, పోలీసు అధికారులు వెంటనే కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, అక్రమ ఇసుక రవాణాకు సహకరించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమార్కులకు సహకరించినా కఠిన చర్యలు చేపడతామని కరాఖండిగా తేల్చి చెప్పారు.
