HomeTelanganaNizamabadమున్సిపల్ ‘ఓటరు’ జాబితా పై రగడ..నివ్వెరపోతున్న అభ్యర్థులు..ఒక వార్డు ఓట్లు మరొకచోటకి.. తొలగించని మృతుల పేర్లు..జిల్లా...

మున్సిపల్ ‘ఓటరు’ జాబితా పై రగడ..నివ్వెరపోతున్న అభ్యర్థులు..ఒక వార్డు ఓట్లు మరొకచోటకి.. తొలగించని మృతుల పేర్లు..జిల్లా వ్యాప్తంగా 60 వేల ఓట్లలో తేడాలు?

మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే ఓటర్ల జాబితా వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితాలు తప్పుల కుప్పగా మారడంతో అటు ఓటర్లు, ఇటు రాజకీయ పార్టీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.

క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా, కార్యాలయంలో కూర్చుని రూపొందించినట్లుగా ఉన్న ఈ జాబితాలు గందరగోళానికి తెరలేపాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 60 వేల ఓట్లు అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మున్సిపల్ రికార్డుల్లో ఎక్కడా లేని ఇళ్ల ‘బై నంబర్ల’తో వందలాది ఓట్లు జాబితాలో దర్శనమివ్వడం గమనార్హం. ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లను సంబంధం లేని మరో వార్డులోకి చేర్చారు.

స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లు జాబితాలో నిండిపోగా, ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లను సైతం తొలగించకపోవడం అధికారుల తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత పేర్లు గాలిలో కలిసిపోగా, లేని వ్యక్తుల పేర్లు మాత్రం జాబితాలో మెరుస్తున్నాయి.

ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ఆశావాహులు ఈ జాబితాలను చూసి తలలు పట్టుకుంటున్నారు. తమ వార్డులో ఎన్నడూ చూడని పేర్లు వందల సంఖ్యలో కనిపించడంతో ‘దొంగ ఓట్ల’ భయం పట్టుకుంది. ఈ తప్పుల తడక జాబితాతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు ఫిర్యాదుల వెల్లువ కురుస్తోంది.


అఖిలపక్ష భేటీ.. అధికారుల వివరణ
ఓటర్ల జాబితాపై నెలకొన్న ప్రతిష్టంభనను గమనించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సహా ఇతర పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో ఆరా తీశారు.

అధికారుల తీరుపై నిలదీయడంతో మున్సిపల్ కమిషనర్ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఫిర్యాదులను పరిశీలిస్తామని, తప్పులను సరిదిద్ది పారదర్శకమైన జాబితాను రూపొందిస్తామని ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments