నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పేరుకే ‘జనరల్’ కానీ, అక్కడ అందుతున్న సేవలు మాత్రం అధ్వాన్నం. ఎమ్మెల్యేలు వచ్చారు.. కలెక్టర్లు వెళ్లారు.. సలహాదారులు సందర్శించారు.. కానీ, ఆసుపత్రి తీరు మాత్రం మారలేదు.
రోగి ప్రాణం గాలిలో దీపంలా మారుతున్నా, యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఆకస్మిక తనిఖీకి వచ్చిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ ఆసుపత్రిలోని సమస్యలు చూసి విస్తుపోయారు.
పేదవాడి గుండె ఆగిపోతుంటే కాపాడాల్సిన రూ. 7 కోట్ల విలువైన యాంజియోగ్రామ్ యంత్రం గత రెండేళ్లుగా మూలనపడి తుప్పు పడుతుండటంపై డీఎంఈ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్డియాలజిస్టులు ఉన్నా, వారిని ఉపయోగించుకోవడంలో విఫలమైన వైనాన్ని ఆయన ఎండగట్టారు.
త్వరలోనే ముగ్గురు నిపుణులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి గుండె సేవలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఎంసీహెచ్ భవనంలో ‘క్రిటికల్ కేర్ సెంటర్’ అని భారీ బోర్డులు తగిలించారు తప్ప, అక్కడ సరైన వైద్యులే లేకపోవడం దారుణం.
ఇక అత్యవసర చికిత్సా విభాగం పరిస్థితి మరీ ఘోరం. 20 పడకలు ఉంటే కేవలం 3 మానిటర్లు మాత్రమే ఉండటం చూసి రోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు కాపాడే ‘లైఫ్ సేవింగ్ డ్రగ్స్’ కూడా లేకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆసుపత్రిలో అడుగుపెడితే చాలు పారిశుద్ధ్య లోపంతో రోగాలు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. కాంట్రాక్ట్ ముగిసిందని కుంటి సాకులు చెబుతున్న అధికారులు, రోగుల గోడును వినడం లేదు. రక్తపరీక్ష ఫలితాలు రావడానికి ఒక రోజంతా పడుతుండటంతో, వైద్యం అందక రోగుల పరిస్థితి విషమిస్తోంది.
అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో జీజీహెచ్ కునారిల్లుతోంది. వెంటిలేటర్ల కొరత, మందుల కొరతపై రాష్ట్రస్థాయి బృందానికి నివేదిస్తామని డీఎంఈ చెప్పారు.
మరి ఈ పర్యటనతోనైనా ఆసుపత్రికి మహర్దశ పడుతుందో లేక ఎప్పటిలాగే ‘తనిఖీ-ఫోటో-ముగింపు’ అన్నట్లు సాగుతుందో వేచి చూడాలి.
