ఈతకు వెళ్లిన ముగ్గురు గల్లంతు అయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.గండిపేట్ మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు లోతైన నీటిలో మునిగిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతులు కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)గా గుర్తించారు. వీరంత హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
