మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకల సందర్భంగా ఇందూరుకు చెందిన ప్రముఖ కవులు, రచయితలు దారం గంగాధర్ మరియు తోగర్ల సురేష్లకు ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయంలో ఘనంగా నిర్వహించిన సాహిత్య సభలో ఇద్దరు కవుల తాజా రచనలైన ‘మందారం’, ‘సౌగంధిక స్వయంవరం’ పుస్తకాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ భుజంగరావు దారం గంగాధర్ రచించిన ‘మందారం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ బాల శ్రీనివాస్ మూర్తి తోగర్ల సురేష్ రచించిన ‘సౌగంధిక స్వయంవరం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.సభకు బాపూజీ వచనాలయం అధ్యక్షుడు భక్తవత్సలం అధ్యక్షత వహించగా, కవి సామ్రాట్ వి.పి. చందన్ రావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.
ప్రముఖ రచయిత, కవి డాక్టర్ గంట్యాల ప్రసాద్, ప్రముఖ కవి, రచయిత ఇప్పకాయల సుదర్శన్ నూతన గ్రంథాలను సమీక్షిస్తూ రచయితల సాహిత్య ప్రతిభను కొనియాడారు.దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా దారం గంగాధర్, తోగర్ల సురేష్‌లకు బాపూజీ వచనాలయం ఆధ్వర్యంలో దాశరథి పురస్కారాలు అందజేశారు.
ఈ పురస్కారం అందుకోవడం తమ సాహిత్య ప్రయాణానికి మరింత ప్రేరణనిస్తుందని ఇద్దరు కవులు పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పురస్కార గ్రహీతలను అభినందించారు. సాహిత్య చర్చలు, కవితా పఠనాలతో సభ సాహిత్య వాతావరణంలో ఘనంగా ముగిసింది.
