నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్న డీలర్లు కమిషన్ డబ్బులు అందక పరేషాన్ లో ఉన్నారు.
గత ఏప్రిల్ నెల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ బకాయిలు మంజూరు చేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 750 మంది రేషన్ డీలర్లు ప్రతినెల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ నెలలో, ఒకేసారి మూడు నెలల కోటాను ఆగస్టు మాసం వరకు లబ్ధిదారులకు అందజేశారు.
అయితే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు డీలర్లకు ఐదు నెలల కమిషన్ రావాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 750 మంది డీలర్లకు కమిషన్ కింద ఒక కోటి యాభై లక్షల రూపాయలు ప్రతినెల చెల్లిస్తున్నారు.
ఐదు నెలలుగా రావాల్సి ఉన్న కమిషన్ డబ్బులపై ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదని వాపోతున్నారు గతంలో రాష్ట్ర పౌరసరాఫరా శాఖ కమిషనర్ కార్యాలయం నుండి ప్రతినెల కమిషన్ అందేది.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా సొమ్మును వేర్వేరుగా విడుదల చేయాలని మే నుంచి నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నేరుగా డీలర్ల బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. కేంద్రం జిల్లా.
ట్రెజరీ శాఖ కార్యాలయం నుంచి కమీషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల మొత్తాన్ని ఇటీవల విడుదల చేసింది. జూన్, జులై, ఆగస్టు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
గత ఐదు నెలల కమీషను విడుదల చేయలేదని రేషన్ డీలర్ల నాయకులు అంటున్నారు. ప్రతినెల బియ్యం పంపిణీ చేసే డీలర్లు కమిషన్ రావడంలో జాప్యం కావడంతో ఆర్థికంగా, మానసికంగా దిగులు పడుతున్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా కాకుండా పాత పద్ధతిలోనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన బాట తప్పదని ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నారు.
కమిషన్ డబ్బులు వెంటనే చెల్లించాలి గత ఐదు నెలలుగా ప్రభుత్వం కమిషన్ డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.
ఇకనైనా పాత పద్ధతిలోనే బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. లేకపోతే సమస్య పరిష్కారం కోసం నిరసన బాట పట్టవలసి వస్తుంది
