రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పనుంచే కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో అత్యున్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పుష్కరాల సందర్భంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న గోదావరి పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.
భక్తుల రద్దీని అంచనా వేస్తూ క్యూ లైన్ల నిర్వహణ, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళికలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై చర్చించారు.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రత్యేక సహాయక కేంద్రాలు, తాత్కాలిక పోలీస్ అవుట్‌పోస్టులు, ఆధునిక సదుపాయాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఘాట్ల వద్ద భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ఏకకాలంలో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అగ్నిమాపక, వైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్/ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు తాగునీరు, లైటింగ్, పారిశుద్ధ్య విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
అలాగే, తప్పిపోయిన వారి ఆచూకీ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి పోలీస్ యూనిట్ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం పెంచుకుంటూ భక్తులకు మరువలేని ఆధ్యాత్మిక అనుభూతిని, సురక్షిత వాతావరణాన్ని అందించాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య., అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేష్, గోదావరి పరివాహక ప్రాంతాల సీఐలు, ఎస్సైలు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
