అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి..అవగాహన సదస్సులో ఇన్‌స్పెక్టర్ ముఖీద్ పాషా.. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్లు సృష్టించిన భ్రమ మాత్రమే..
చట్టంలో అలాంటి విధానమే లేదు” అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ముఖీద్ పాషా పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులు, అధ్యాపకులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. అమాయక ప్రజల బలహీనతలే నేరగాళ్లకు బలంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దన్నారు.
ఫోన్లకు వచ్చే తెలియని ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే ఫోన్లోని డేటా మొత్తం నేరగాళ్ల వశమవుతుందని హెచ్చరించారు.పోలీసులమని, కస్టమ్స్ అధికారులమని చెప్పి వాట్సాప్ వీడియో కాల్స్ చేసే వారిని నమ్మవద్దని, ఏ ప్రభుత్వ అధికారి కూడా ఎంక్వైరీ కోసం వీడియో కాల్స్ చేయరని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం వెతికి సైబర్ వలలో చిక్కుకోవద్దని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకుని మోసాలు చేసే ముప్పు ఎక్కువగా ఉందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సైబర్ మోసానికి గురైన బాధితులు వెంటనే (గోల్డెన్ అవర్) 48 గంటల్లోపు 1930 నెంబర్‌కు సమాచారం అందించాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, సైబర్ క్రైమ్ ఎస్సైలు ప్రవళిక, రవికుమార్, సీసీపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
