హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయయాత్ర వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఆంజనే యుడు, శ్రీరాముడు, శివుడు, దత్తాత్రేయుడు, భారతమాత, ఛత్రపతి శివాజీ తదితర ప్రతిమలను ఊరేగించారు.
ఉదయం 11:30 గంటలకు కంఠేశ్వరాలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, కాంగ్రెస్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆర్య సమాజ్ నిర్వాహకులు సంచార వాహనంలో హోమం చేశారు.
శోభాయాత్రలో హిందూ సంఘాల నాయకులు, యువకులు ఎంతో ఉత్సాహంగా అడుగడు గునా అంజనీపుత్రుడి కీర్తనలే జైశ్రీరాం. రాంలఖన్ జానకీ.. జై బోలో హనుమాన్ కీ, భజరంగ్ దళ్ అంటూ పెద్ద పెద్ద నినాదాలతో నృత్యాలు చేస్తూ, అంజన్న నామస్మరణతో ఇందూరు మారుమోగుతుంది.
ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర సుభాష్నగర్, హమాల్వాడి, నాందేవ్వాడ శివాజీ చౌక్, రైల్వే వంతెన, దేవిరోడ్, గాంధీచౌక్, నెహ్రూ పార్కు పెద్ద బజార్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ శోభాయా త్రలో వేల మంది భక్తులు పాల్గొన్నారు.
యాత్ర నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.1300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యాత్ర సాగే మార్గాల్లో ప్రతి అడుగునూ సీసీ కెమెరాల ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా వాహనాలను మళ్లించారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
