డ్రగ్స్ ఉన్నాయనే సమాచారం మేరకు తనిఖీ చేస్తున్న పోలీసులపై కారు దూసుకెళ్లిన ప్రమాదం లో కానిస్టేబుల్ కాలు విరిగింది ఈ ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. ఆదివారం సాయంత్రం అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి వెళ్ళాడు .
కారు రాగానే, ఓ వ్యక్తి కారులో ఉన్న వారికి ఒక డ్రగ్స్ ప్యాకెట్‌ను అందించాడు. పోలీసులు వెంటనే ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ కారులో ఉన్న హుస్సేనీ ఆలమ్‌కు చెందిన సైఫ్ కారును పక్కకు తీస్తున్నట్లుగా చేసి ఒక్కసారిగా కారును రివర్స్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి కారును పోనిచ్చాడు.అనంతరం కారుతో వేగంగా పారిపోతుండగా, ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బృందం అతడిని వెంటాడి అఫ్జల్‌గంజ్ వద్ద అడ్డుకుంది.
ఈ ప్రక్రియలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. కారు కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ను వెంటనే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.
