పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లి, రోజుల తరబడి ఎదురు చూసి మనస్తాపానికి గురైన ఓ రైతు కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్(48) ఈనెల 6వ తేదీన జొన్నలను విక్రయించేందుకు సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు.
వాటిని విక్రయించిన అనంతరం హమాలీలకు కూలీ చెల్లించాడు. తూకం వేసిన జొన్నలను లారీల్లో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు చెల్లించాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది కోరినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తన వద్ద లోడింగ్ ఖర్చులకు డబ్బులు లేవని రైతు వాపోయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. పదిరోజులుగా నిరీక్షించినా, పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన రాలేదని తెలిపారు.
దీంతో మనస్తాపానికి గురైన పాండురంగ్ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
