ఆయా మండల కేంద్రాల్లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన. – కమ్మర్ పల్లి లో జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు
అసెంబ్లీ సమరంలో ప్రతి రైతుకు షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. అయితే ఎన్నికలు పూర్తయి 8 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు
హామీలు ఒక్కటి ఒక్కటిగా నెరవేరుస్తున్నప్పటికిని, రైతు రుణమాఫీ విషయంలో నెలకొన్న అయోమయం రైతులను ఆగ్రహానికి గురిచేస్తుంది, ఆగస్టు 15 లోపు మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికిని
రుణమాఫీకి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు వర్తించకపోవడంతో అర్హులైన వారికే రుణమాఫీ చేశామని అధికారులు చెబుతున్న, రైతుబంధుకు లేని ఆంక్షలు రైతు రుణమాఫీ ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు,
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో అనేకమంది రైతులకు నిబంధనల మాటున రుణమాఫీకి అర్హులు కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రభుత్వ తీరుపై గుస్సుమంటున్నారు.
ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడపల్లి లో ప్రారంభమైన రైతుల ఆందోళన చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేస్తూ ఉంటే…
మరోపక్క రైతులంతా ఒక్కటై రైతు కార్యాచరణ కమిటీ పేరుతో 24వ తేదీన ఆర్మూర్ లో మూడు నియోజకవర్గాలైన ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పెద్ద ఎత్తున శాంతియుత నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలో ఎర్ర జొన్న మద్దతు ధర కోసం ఉద్యమించి తూటాలకు ఎదురు నిలిచిన రైతాంగ స్పూర్తిని నిలిపిన ఆర్మూర్ ప్రాంత రైతులు మరో మారు కాంగ్రెస్ సర్కార్ పై పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
నేడు కమ్మర్ పల్లి తో పాటు కొన్నిచోట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు.ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి పార్టీలకు కతీతంగా కమ్మర్ పల్లి మండల రైతులు రోడ్డెక్కారు.
కమ్మర్ పల్లి మండల రైతులు పార్టీలకతీతంగా మండల కేంద్రంలోని హసకొత్తూరు చౌరస్తా జాతీయ రహదారి 63 రోడ్డుపై ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మండల రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి అబద్ధపు హామీలను ఇవ్వడమే కాకుండా దైవ ప్రమాణం చేయడం జరిగిందని,
తీరా గెలిచిన తర్వాత రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ అందించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఆంక్షలు లేకుండా వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.. రైతులు రోడ్డుపై ఆందోళన చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలునిలిచిపోయాయి.
దీంతో కొంతసేపు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.. రేపు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
24న మహా ధర్నా కోసం గ్రామాలలో రైతులను సంఘటితం చేసే పనిలో రైతు నేతలు బిజీగా ఉన్నారు. ఆర్మూర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మహాధర్నా కరపత్రికలను విడుదల చేశారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయకుంటే మహా ధర్నా చేసి తీరుతామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు అంటున్నారు.
రుణమాఫీ వర్తించిన రైతుల కంటే రుణమాఫీ వర్తించని రైతుల సంఖ్య వేళల్లో ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు ఆర్మూర్ కు తరలిరావడానికి సిద్దం అవుతున్నారు.