చివరి ప్రయాణంలో తోడెవరూ లేని అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా.. వారి అస్థికలకు కూడా అంతిమ గౌరవం కల్పించారు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు. సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించిన అనాథల అస్థికలను భద్రపరిచి కాశీకి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తీసుకెళ్లారు.
సోమవారం మణికర్ణికా ఘాట్‌లో శాస్త్రోక్తంగా పిండప్రదానం నిర్వహించి.. అనంతరం అస్థికలను పవిత్ర గంగానదిలో కలిపారు. సాధారణంగా కుటుంబ సభ్యులు మరణించిన వారి అంత్యక్రియలతో పాటు తదుపరి కర్మలను నిర్వహిస్తారు. అయితే ఎవరూ లేని అనాథ మృతదేహాలకు ఆ బాధ్యతను ఇందూరు యువత సంస్థ స్వీకరిస్తోంది.
అంత్యక్రియలతో సేవను ముగించకుండా.. అస్థికలను భద్రపరిచి కాశీకి తీసుకెళ్లి పిండప్రదానం, అస్థికల నిమజ్జనం వరకు కార్యక్రమాన్ని కొనసాగించింది. ఎవరూ పట్టించుకోని అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం తమ సేవా కార్యక్రమాల్లో భాగమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు.
మరణించిన వారికి కూడా గౌరవంగా వీడ్కోలు పలకడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరూ లేని వారి చివరి ప్రయాణంలో అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, పసునూరి వినయ్‌కుమార్, యూవీ ఫౌండేషన్ సుజన్‌కుమార్, ఇందూరు యువత ప్రతినిధులు ఇందూరి శేఖర్, రాజు, వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
