జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం సుభాష్ నగర్‌లోని నారాయణ పబ్లిక్ స్కూల్‌లో త్రీటౌన్ ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు రహదారి భద్రతపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
హెల్మెట్ & సీట్ బెల్ట్: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ మాత్రమే ఉపయోగించాలని, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు..
ప్రాణాల మీదకు తెచ్చే ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడటం మృత్యువును ఆహ్వానించడమేనని హెచ్చరించారు. ఓవర్ స్పీడ్ (అతివేగం) వద్దని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కూడా బలి అవుతాయని గుర్తు చేశారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి ఈ ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయాలని, చిన్న వయసులోనే వీటిపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని పోలీసులు కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, త్రీటౌన్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
