వరుస వివాదాలతో నిజామాబాద్ సెంట్రల్ జైలు ప్రతిష్ఠ మసకబారుతోంది. క్రమశిక్షణకు, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరుగా ఉండాల్సిన నిజామాబాద్ కేంద్ర కారాగారం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
జైలు గోడల మధ్య అధికారుల అక్రమాలు, ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జైలులో గంజాయి లభ్యం కావడం కలకలం రేపుతుండగా, అసలు దోషులను వదిలేసి ఖైదీలపై ప్రతాపం చూపడంపై అనుమానాలు బలపడుతున్నాయి. గత కొంతకాలంగా ఈ జైలులో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరు తీవ్ర చర్చనీయాంశమైంది.
గతంలో జైలు భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరిపించి, నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా, ఒక ఉన్నతాధికారిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు, ఖైదీలతో అధికారులు అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కనీస మానవ హక్కులను కాలరాస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత కట్టుదిట్టమైన నిఘా, నిరంతరం సీసీ కెమెరాల పహారా ఉండే సెంట్రల్ జైలులోకి నిషేధిత మత్తు పదార్థాలు చేరడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది. తాజాగా ఖైదీల వద్ద గంజాయి, సిగరెట్లు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. గంజాయి దొరకగానే అధికారులు ఖైదీలను చితకబాది మమ అనిపించారు.
కానీ, అసలు ఆ మత్తు పదార్థాలు లోపలికి ఎలా వచ్చాయి? గేటు వద్ద తనిఖీలు దాటుకుని లోపలికి చేరాయంటే లోపల ఎవరి సహకారం ఉంది? అనే కోణంలో విచారణ జరపకపోవడం గమనార్హం. జైలు సిబ్బంది లేదా అధికారుల ప్రమేయం లేకుండా నిషేధిత వస్తువులు లోపలికి వెళ్లడం అసాధ్యమనేది బహిరంగ రహస్యం. గంజాయి సరఫరా వెనుక ఉన్న ‘పెద్దల’ హస్తాన్ని దాచిపెట్టేందుకే, కేవలం ఖైదీలపై దాడి చేసి కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
