తాను పుట్టి పెరిగిన ఊరు.. అక్షరాలు నేర్చుకున్న బడి రుణం తీర్చుకున్నారు ఓ పోలీస్ అధికారి. తల్వేద గ్రామ వాస్తవ్యులు, ప్రస్తుతం సి.ఐ.గా విధులు నిర్వహిస్తున్న అంకంపల్లి గంగాధర్ తన సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి భారీ విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
సోమవారం తల్వేద జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సుమారు రూ. 2.50 లక్షల విలువైన ఫర్నిచర్‌ను ఆయన స్పాన్సర్ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఆయన పెద్ద ఎత్తున ఫర్నిచర్‌నుఅందజేశారు.
ఉన్నత పాఠశాలకు 30 బెంచీలు, 6 టేబుళ్లు.ప్రాథమిక పాఠశాలకు 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు, 2 టేబుళ్లు విరాళం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. “జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ఇష్టంతో కూడిన కష్టమే ఏకైక మార్గం.
సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. మీ భవిష్యత్తును నిర్మించుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది” అని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
పాఠశాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచిన సి.ఐ. గంగాధర్ ని జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు డి. మోహన్, ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జి. శ్రీకాంత్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
