సిరికొండ మండలం రావుట్ల పరిధిలోని అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ గ్రామస్థులు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో, అధికార యంత్రాంగం స్పందించింది.
ఆక్రమణలకు గురైన అటవీ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియను బుధవారం అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ప్రారంభించారు.
వివాదాస్పద భూముల్లో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనగత కొంతకాలంగా రావుట్ల శివారులోని అటవీ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన స్థానికులు, ఇటీవల కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలను అరికట్టాలని ఆదేశించింది.
బుధవారం ఉదయాన్నే అటవీ శాఖ అధికారులు భారీ సంఖ్యలో పోలీసు బలగాలతో రావుట్లకు చేరుకున్నారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించి, వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా, అటవీ శాఖ సిబ్బంది ఆ భూములకు రక్షణగా కంచె ఏర్పాటు చేస్తున్నారు.
“ప్రభుత్వ భూములను, అటవీ సంపదను కాపాడటమే మా బాధ్యత. ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు” అని అధికారులు హెచ్చరించారు. ఈ చర్యతో అటవీ భూముల ఆక్రమణదారుల్లో కలకలం మొదలైంది. .
