నిజామాబాద్ మాతాశిశు ఆసుపత్రి నుంచి శనివారం ఉదయం కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల వేదాన్స్ ఆచూకీ లభించినట్లు విశ్వసనీయ సమాచారం. సంగారెడ్డి వద్ద బాలుడిని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
బాలుడు కనిపించకుండా పోయిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు.
ఈ క్రమంలో సంగారెడ్డి వద్ద బాలుడి ఆచూకీ లభించినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.పోలీసుల అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
