నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరవడిన రక్షణ వ్యవస్థ మాతా శిశు ఆసుపత్రిలో బాలుడి అపహరణతో మరోసారి బట్టబయలు కొత్త భవనం.. భద్రత మాత్రం అంతంతే పోలీసు ఔట్‌పోస్టు లేదు.. పటిష్ఠ నిఘా లేదు.. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట లేదునిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గతంలో చోటుచేసుకున్న చిన్నారుల అపహరణ ఘటనలు, చోరీలు, ఆకతాయిల ఆగడాల నుంచి యంత్రాంగం గుణపాఠం నేర్చుకోకముందే నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిలో బాలుడు అపహరణకు గురైన ఘటన చోటుచేసుకుంది.
వేలాదిమంది రోగులు, వారి బంధువులు నిత్యం రాకపోకలు సాగించే ఆసుపత్రిలో కనీస పోలీసు ఔట్‌పోస్టు, పటిష్ఠమైన నిఘా, తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది.
కోట్ల రూపాయలతో మాతా శిశు ఆసుపత్రి కోసం నూతన భవనాన్ని నిర్మించి ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ భవనంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఆసుపత్రిలోకి వచ్చేవారు.. బయటకు వెళ్లేవారు..అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచే పటిష్ఠ వ్యవస్థ కనిపించడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.రోజూ భారీ సంఖ్యలో రోగులు, వారి బంధువులు వచ్చే మాతా శిశు ఆసుపత్రిలో ప్రత్యేక పోలీసు ఔట్‌పోస్టు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడం భద్రతా పరమైన సమస్యలకు దారితీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నా.. ఇంత పెద్ద ఆసుపత్రికి సరిపడా పర్యవేక్షణ జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
అర్ధరాత్రి ఆకతాయిల ఆగడాలు మాతా శిశు ఆసుపత్రి పరిసరాల్లో రాత్రివేళల్లో ఆకతాయిల సంచారం, గొడవలు, హంగామా వంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నట్లు రోగుల బంధువులు చెబుతున్నారు.
అర్ధరాత్రి వేళల్లో ఆసుపత్రి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై పలుమార్లు ఫిర్యాదులు, కథనాలు వచ్చినా భద్రతను పటిష్ఠం చేయడంలో అధికారులు, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.చోరీలకూ అడ్డుకట్ట కరవే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. వారి వాహనాలు, సెల్‌ఫోన్లు, పర్సులు, నగదు, ఆభరణాలు చోరీకి గురైన ఘటనలు అనేకం.
ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు తీసుకోవడం, కేసు నమోదు చేయడం జరుగుతున్నా.. ముందస్తు నిఘా, నిరంతర పర్యవేక్షణపై మాత్రం తగిన శ్రద్ధ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఘటనల నుంచి గుణపాఠం ఏది? నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో గతంలోనూ చిన్నారుల అపహరణ ఘటనలు చోటుచేసుకున్నాయి.
2024లో జీజీహెచ్‌లో మూడు సంవత్సరాల బాలుడు అపహరణకు గురైన ఘటనతో పాటు అదే ఏడాది మరో బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగుచూసింది. అప్పట్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి.
అయినప్పటికీ తాజాగా మాతా శిశు ఆసుపత్రిలో మరో చిన్నారి అదృశ్యమవడం భద్రతా చర్యలు ఏ మేరకు అమలవుతున్నాయన్న దానిపై విమర్శలకు తావిస్తోంది. మరో బిడ్డ ప్రసవం కోసం వచ్చి.. ఉన్న బిడ్డను కోల్పోయి బాల్కొండ మండలం నాగాపూర్‌కు చెందిన కుటుంబం శనివారం పిల్లలతో కలిసి నిజామాబాద్ మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉండగా పిల్లలు బయట ఆడుకుంటున్నారు.
ఈ సమయంలో గుర్తుతెలియని మహిళ ఇద్దరు పిల్లల వద్దకు వెళ్లగా.. పెద్ద బాలుడు తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరాడు. చిన్న బాలుడు వేదాన్ష్‌ను మాత్రం ఆ మహిళ వెంట తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.బాలుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలుడిని మహిళ వెంట తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు.పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.బాలుడు అదృశ్యం అయ్యి 24 గంటలు గడిచినా ఎలాంటి ఆచూకి, సమాచారం లభించక పోవడంతో ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా ఉంటే తమ బిడ్డ ఇలా అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఆసుపత్రి భద్రతా వ్యవస్థపై కూడా సమగ్ర విచారణ జరపాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా ఘటనతోనైనా అధికారులు, పోలీసు యంత్రాంగం మేల్కొని మాతా శిశు ఆసుపత్రిలో భద్రతను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేయడం, తగినంత మంది భద్రతా సిబ్బందిని నియమించడం, ప్రవేశ ద్వారాల వద్ద నిఘా పెంచడం, సీసీ కెమెరాల సంఖ్యను పెంచి నిరంతరం పర్యవేక్షించడం, రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేయడం వంటి చర్యలు అత్యవసరంగా చేపట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
