కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట గ్రామంలో ఓ వృద్ధురాలిని నమ్మించి నగలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాశవ్వ వద్దకు శనివారం ఓ వ్యక్తి వచ్చి, జైల్లో ఉన్న ఆమె కుమారుడు తనకు పరిచయమని, బెయిల్‌పై విడుదల చేయించేందుకు డబ్బులు అవసరమని నమ్మబలికాడు.
అనంతరం ఆమెకు కల్లు తాగించి మత్తులోకి వెళ్లేలా చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించాడు. అక్కడే ఉన్న మరో మహిళ పోచవ్వకు చెందిన వెండి పట్టీలను కూడా లాక్కొని పరారయ్యాడు.
బాధితులు తేరుకుని విషయం గుర్తించడంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
