- బాల్కొండ, ఆర్మూర్ ల్లో కాంగ్రెస్ గూటికి చేరుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు
- వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ నేతలు
జాన రమేష్, ఇది సంగతి : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతోంది. ఆయా పార్టీలలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చాక 100 రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీ మేరకు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పలువురు దృష్టిని ఆకర్షిస్తుంది.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో గ్రామాలలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బి ఆర్ ఎస్, బిజెపి నుండి చాలామంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రానున్న పక్షం రోజుల్లో వలసల జోరు నిజామాబాద్ అర్బన్, రూరల్ లతోపాటు ఆర్మూర్ , బాల్కొండ, బోధన్ లలో మరింత పెరిగే అవకాశం ఉంది.
టిఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిలర్లు కట్టకట్టుకుని ముకుమ్మడిగా పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.అంతేకాకుండా నందిపేట మండలం వెల్మల్ గ్రామ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ ,పెద్ద గంగారాం తెరాస పార్టీ నుండి వెల్మల్ లో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది .సర్పంచ్ తో పాటు గ్రామ తెరాస నాయకులు గంగాధర్, శ్రీకాంత్, చిన్న గంగన్న, సాయిలుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయా మండలాల్లో సైతం ప్రధాన నాయకులంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
అలాగే బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ ఎం పి టి సి ఆస్మా అజారుద్దీన్ తో పాటు, భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ కేతావత్ సంతాలి వల్లి లు కాంగ్రెస్ గూటికి చేరారు. అధికార కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నుండి పలువురు నాయకులు జై కొట్టనున్నారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు వలసల పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య అప్పటి ముఖ్యమంత్రి కూతురుగా ఉన్న కల్వకుంట్ల కవితకు ఓటమి రుచి చూపించి బిజెపి పార్టీ ద్వారా బరిలో ఉన్న అరవింద్ కు పట్టం కట్టారు.
ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ ఉండటం, మరోపక్క ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ ఎమ్మెల్యేగా సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యేగా పైడి రాకేష్ రెడ్డిలు గెలుపొందడంతో బిజెపి మరింత బలపడింది. దీంతో కమల నాదుల కోటను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా చేరికలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మరింత మంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కండువా వేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.