నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం రణరంగంగా మారింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పాత సీఐజీ గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు భారీ ఎత్తున కదిలారు. మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయం నుండి కోర్టు చౌరస్తా, ధర్నా చౌక్ మీదుగా కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కమిషనర్ ఛాంబర్ ముందు భైఠాయించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓ. మయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ.. కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను రద్దు చేయాలనుకోవడం సరికాదని మండిపడ్డారు.
దీనివల్ల పనిభారం పెరగడమే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఏజెన్సీలో ఉన్న 330 మంది కార్మికులు, వాటర్ వర్క్స్ కార్మికులు, డ్రైవర్లను కలిపి 25 నుండి 35 మందితో కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాత గ్రూపులను కదిలిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.పండుగల వేళ కార్మికుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సీఐజీ గ్రూపు కార్మికులకు ఆపడం అన్యాయమని, ఉగాది, రంజాన్ పండుగల దృష్ట్యా బుధవారం సాయంత్రంలోగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఇతర కార్పొరేషన్లలో ఇస్తున్నట్లుగా కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ తప్పులను సరిదిద్దాలని కోరారు. 14 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని స్పష్టం చేస్తూ అడిషనల్ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.ఆందోళనలో భాగంగా కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డెప్యూటీ కమిషనర్‌ను కలవడానికి వెళ్లిన క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ క్రమంలో మాధవి, పార్వతి అనే మహిళా కార్మికులు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. తోటి కార్మికులు వారికి సపర్యలు చేసి, వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
