పోలీసు శాఖలో ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలం పాటు ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం గొప్ప విషయం అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రశంసించారు.
శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులకు, సిబ్బందికి కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో విధులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో పోలీసు విభాగానికి వారు అందించిన సేవలు ఎంతో గణనీయమైనవని గుర్తుచేశారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమైన ప్రక్రియ అని, విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమిస్తూ సమాజ రక్షణ కోసం పనిచేసిన మీ సేవలు శ్లాఘనీయమని అన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఎస్సైలు ఎస్. సంతోష్ రెడ్డి (ఎస్ఐ, స్పెషల్ బ్రాంచ్): 42 ఏళ్ల సర్వీసు, వి. సాయన్ రావు (ఎస్ఐ, స్పెషల్ బ్రాంచ్): 43 ఏళ్ల సర్వీసు, జలగం చంద్రశేఖర్ రావు (ఆర్ఎస్ఐ, హెడ్ క్వార్టర్స్): 38 ఏళ్ల సర్వీసు, వి.ఎన్. సత్యనారాయణ (ఏఆర్ఎస్ఐ, హెడ్ క్వార్టర్స్): 42 ఏళ్ల సర్వీసు, ఎం.డి. తజ్ముల్ అహ్మద్ (ఏఆర్ఎస్ఐ, హెడ్ క్వార్టర్స్): 42 ఏళ్ల సర్వీసు, ఏ. శంకర్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్-748): 41 ఏళ్ల సర్వీసు.పదవీ విరమణ తర్వాత కూడా సిబ్బందికి ఎలాంటి అవసరం వచ్చినా శాఖ పరంగా ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని సీపీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు ఎన్. శుభం ప్రకాష్, రామ్ చందర్ రావు, ఏసీపీలు దీపక్ చంద్ర, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
