నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం తరఫున వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదనీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు.
కేవలం మొక్కుబడిగా జిల్లాలో కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ మాత్రం మొదలుకాలేదనీ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సారి ఖరీఫ్ లో లక్షల ఎకరాలలో వరిసాగు చేశారు. చాలా చోట్ల రైతులు ఇప్పటికే వరి పంట కోత పూర్తి చేశారనీ తెలిపారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వల్ల రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల వద్ద కుప్పలు పోశారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రోడ్లపై ఉన్న ఈ ధాన్యం పూర్తిగా తడిసిపోవడం జరిగిందన్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారనీ అన్నారు.
అంతేకాకుండా, వర్షాలకు నేలకొరిగిన వరి పంట కారణంగా కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కావున, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించి. తడిసి, రంగుమారిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వడ్ల కొనుగోలు, బోనస్ చెల్లింపుల్లో కాంగ్రెస్ వైఫల్యం.
తెలంగాణ రైతు వర్షంలోనూ, ఎండలోనూ పంట కాపాడుకుంటూ ఎదురు చూస్తున్నాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఆలస్యం చేస్తోందనీ విమర్శించారు. 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం చెప్పి కూడా ఇప్పటివరకు సక్రమంగా కొనుగోలు ప్రారంభించలేదు.
80 లక్షల టన్నులు కొంటామన్నా, నిధుల కొరత అంటూ తిప్పలు పెడుతోందన్నారు. పల్లెల్లో కోతలు పూర్తి అయ్యి నెలలు గడిచినా, కొనుగోలు ప్రక్రియ మొదలుకాలేదు. రైతులు కల్లాల్లో ధాన్యం నిల్వచేసి నష్టపోతున్నారు.
పల్లెల్లో కోతలు జోరుగా సాగుతున్నా, కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించక పోవడం రైతుల్లో ఆందోళనకు దారితీసిందనీ అన్నారు. కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొంటలేదని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.
వరి కొనుగోళ్ల విషయంలో రైతుల ఇబ్బందులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. ట్రాన్స్పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుంది. సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్ ఇస్తున్నది.
రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, సన్నధాన్యంతో పాటు అన్ని రకాల ధాన్యాలకు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
