- చిలకలగూడ పోలీసుల ప్రతిపాదనపై కమిషనర్ ఉత్తర్వులు నగరంలో నిత్య నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ లో పోలీసులు.. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై మరోసారి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టాన్ని అమలు చేశారు.
-
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను మంగళవారం చిలకలగూడ పోలీసులు అమలు చేశారు. వరుస హత్యాయత్నాలు, బెయిల్ నిబంధనల ఉల్లంఘన, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలగూడకు చెందిన బొజ్జ భాగ్యరాజ్‌పై హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో మొత్తం 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, అల్లర్లు, తీవ్ర గాయాలు కలిగించడం, బెదిరింపులు, పోక్సో చట్టం కింద కేసులు తదితర తీవ్రమైన నేరాలు అతనిపై ఉన్నాయి.
- గతంలో రెండుసార్లు పీడీ చట్టం అమలు చేసినప్పటికీ, అనంతరం బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 128 ప్రకారం బైండోవర్ చేసినా సత్ప్రవర్తన పాటించకుండా మళ్లీ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మూడు హత్యాయత్నం కేసుల్లో భాగ్యరాజ్ నిందితుడిగా ఉన్నాడు. రెండు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ పొందినప్పటికీ, వాటిని ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
- ప్రస్తుతం అతడు రిమాండ్‌లో ఉన్నాడు. ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా మారిన నేపథ్యంలో భవిష్యత్తులో నేరాలను అరికట్టేందుకు పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
- చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ బృందం పీడీ ప్రతిపాదనను సిద్ధం చేయగా, ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో, అదనపు డీసీపీ జె. నర్సయ్య ఆధ్వర్యంలో ఉత్తర్వులను అమలు చేశారు. నగరంలో నిత్య నేరస్థులు, రౌడీ షీటర్లు, సంఘవిద్రోహ శక్తులపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కొనసాగిస్తామని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పట్ల పీడీ చట్టంతో సహా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
