రుణమాఫీపై రణం చేసేందుకు ఆర్మూర్ వేదికగా కదం తొక్కిన రైతన్నల నిరసన దీక్షకు రాజకీయ రంగు పులుముకుంది.
రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలు వేరైనా రైతు సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ సర్కారుపై కయ్యానికి కాలు దువ్వినారు కర్షకులు.
ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం చెందిన వేలాది మంది రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేందుకు నిన్న ఆర్మూర్ లో జరిగిన సమావేశం తో ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు రైతులంతా ఒక్కటై నిరసన గళాన్ని వినిపించారు.
రైతు ఐక్య కార్యచరణ కమిటీ పేరుతో రైతు నేతలతో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు.
ఉద్యమాల గడ్డయిన ఆర్మూరు గడ్డ పై రుణమాఫీపై రణం చేయడానికి సర్కార్ కు వచ్చేనెల 15వ తేదీలోపుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలని రైతులంతా డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే జరుగుతున్న రైతు ఉద్యమానికి బిజెపి, బి ఆర్ ఎస్, వామపక్ష పార్టీలు తమ మద్దతును తెలియజేసేందుకు నిరసన స్థలానికి సంఘీభావం తెలిపారు.
ఆర్మూర్ లో ప్రారంభమైన రైతుల నిరసన దీక్ష స్థలానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బాజిరెడ్డి తో పాటు బిజెపి నేతలు పల్లె గంగారెడ్డి , మల్లికార్జున్ రెడ్డిలు సైతం హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
చిత్తశుద్ధితో రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు పోలీసుల ఆంక్షల మేరకు శాంతియుతంగా నిరసన ధర్నాను నిర్వహించి సఫలులయ్యారు.
అయితే రైతు ఉద్యమంలో రాజకీయ జోక్యం ఏమిటి అని కొంతమంది రైతులు రాజకీయ నేతల రాకపై మండిపడుతున్నారు. వచ్చినవారు సంఘీభావం తెలపడానికి కూర్చొని వెళ్ళిపోతే సరి…
అంతేగాని రాజకీయ కోణంలో ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిఆర్ఎస్ నేతలు నిరసన గళాన్ని విప్పడంతో దీక్షకు మరింత బలం చేకూరినట్లు అయిందని మరికొంతమంది రైతులు అభిప్రాయపడుతున్నారు.
సందట్లో సడే మియాగా బిఆర్ఎస్ నేతలు రైతు దీక్షలో మాట్లాడుతున్న సందర్భంలో నిరసనను ఎదుర్కొన్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడంతో…
అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.
దీంతో ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో సోషల్ మీడియా గ్రూపుల్లో గత నిన్నటి నుండి పెద్ద దుమారమే కొనసాగుతుందని చెప్పవచ్చు.
ఏది ఏమైనా ప్రభుత్వంపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్న రైతుల దీక్షపై రాజకీయ రంగు పులుముకోవడంతో నికార్సయిన ఉద్యమ నేతలకు మాత్రం తలపోటు వచ్చినంత పనవుతుంది.
పనిలో పనిగా పలు రాజకీయ పార్టీలపై అభిమానం ఉన్న రైతులు తమ ఉపన్యాసాలలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శన వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అప్పటికే రైతు దీక్షలో ఈ రాజకీయ నీలినీడపై పలువురు రైతులు తెరచాటుగా గుస్సుమనడంతో పొరపాట్లను సరి చేసుకుంటామని చెప్పడం నేతల పనైంది.
ఇప్పటికైనా రైతు ఉద్యమాలతో ప్రభుత్వాలను గద్దె దించిన చరిత్ర గలిగిన ఆర్మూరు ప్రాంత రైతులు రానున్న రోజుల్లో చేయబోయే కార్యచరణలో రాజకీయ పార్టీల ప్రమేయం రైతు పోరుబాటకు దూరంగా ఉంచితే మంచిదని పలువు అభిప్రాయపడుతున్నారు.
లేకపోతే చరిత్రలో గుర్తుండిపోయే మాయని మచ్చ ఈ ఉద్యమానికి మిగులుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఏ కోణంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రైతు నేతలు ప్రకటించబోతున్నారో వేచి చూడాల్సిందే…