నీజామాబాద్ జిల్లా పారిశ్రామిక, వ్యవసాయ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోస్తూ, జనకంపేట రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్‌ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
రూ. 9 కోట్ల వ్యయంతో ఈ గూడ్స్ షెడ్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైల్వే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వివరించారు.సుమారు రూ. 9 కోట్ల వ్యయంతో జనకంపేట స్టేషన్‌లో అభివృద్ధి చేసిన గూడ్స్ షెడ్ రవాణా రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. 700 x 16 మీటర్ల విస్తీర్ణంలో స్లీపర్ మ్యాటింగ్‌తో గూడ్స్ ప్లాట్‌ఫారమ్ నిర్మించారు.
8 మీటర్ల వెడల్పు గల రెండు అప్రోచ్ రోడ్లు, 8 హై-మాస్ట్ లైట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ బియ్యం, మొక్కజొన్న, జొన్నలు లోడ్ చేస్తుండగా, ఎరువులు, సిమెంట్ అన్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోడింగ్ కోసం 10-12 రేకులు, అన్‌లోడింగ్ కోసం 15-17 రేకుల కార్యకలాపాలు సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు.
గత 12 ఏళ్లుగా ప్రధాన మంత్రి నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. 2014-15లో కేవలం రూ. 258 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు, 2026-27 నాటికి రూ. 5,454 కోట్లకు పెరిగి, సుమారు 20 రెట్ల వృద్ధిని సాధించాయి.
గత 12 ఏళ్లలో పెద్దపల్లి-నిజామాబాద్, జగ్గయ్యపేట-విష్ణుపురం, భద్రాచలం-సత్తుపల్లి, అక్కన్నపేట-మెదక్, మనోహరాబాద్-సిద్దిపేట వంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో మొత్తం 340 కి.మీ కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, 562 కి.మీ మేర డబుల్, మూడో మరియు నాలుగో లైన్ పనులు పూర్తి కాగా, మనోహరాబాద్-సిద్దిపేట మార్గం మినహా రాష్ట్రవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ వందశాతం విద్యుదీకరించబడింది.
ప్రస్తుతం రూ. 42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి.ముద్ఖేడ్-మేడ్చల్ డబ్లింగ్‌లో భాగంగా బాసర-నావిపేట మధ్య 15 కి.మీ మార్గం వినియోగంలోకి వచ్చింది. ధర్మాబాద్-మేడ్చల్ మధ్య 172 కి.మీ పరిధిలో ‘కవచ్’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
నిజామాబాద్ స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్, అదనంగా రెండు లూప్ లైన్లు,ఆర్మూర్-మామిడిపల్లి (రూ. 38 కోట్లు),మామిడిపల్లి-నిజామాబాద్ (రూ. 25 కోట్లు) మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యాయి అని పేర్కొన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 58 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, రూ. 124 కోట్లతో 2 కి.మీ బైపాస్ లైన్ నిర్మాణం, ‘కవచ్’ 4.0 అప్‌గ్రేడ్, క్విక్ వాటరింగ్ సిస్టమ్ మరియు మరో మూడు ఆర్ఓబీల పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
