త బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు.
గురువారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా, ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. గత ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాయకుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు గత ప్రభుత్వ అప్పుల భారాన్ని భరిస్తూనే, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని పేర్కొన్నారు.
నిజామాబాద్ నగర అభివృద్ధి పనులపై స్పందిస్తూ, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలు సహా పలు అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశాలను ఇప్పటికే మున్సిపల్ అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వ సలహాదారులకు, పీసీసీ నాయకత్వానికి తెలియజేశానని చెప్పారు.
జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లా కాంగ్రెస్‌లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
