-కమ్మర్ పల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన
-పోలీసుల విచారణలో నిగ్గు తేల్చిన నిజాలు
- నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసిన పోలీసులు
- కటకటాల పాలైన ఫేస్ బుక్ స్నేహితులు
జాన రమేష్: ఇది సంగతి: ఆర్మూర్;
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారు. తన, మన అనే భేదం లేకుండా మానవ జీవితం యాంత్రికమైపోయి నవ నాగరికత జీవనశైలిలో విలువలు మంటగలుస్తున్నాయి. సినీ పక్కిలో పెద్దనాన్న ఆస్తి కోసం హతమార్చేందుకు ఆంధ్రకు చెందిన ఓ వ్యక్తికి సుపారి ఇచ్చిన ఘటన తాజాగా కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలలోకి వెళ్తే… మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఎడ్డి సుధాకర్ అనే వ్యక్తి అతని పెదనాన్న కు మధ్యలో గతంలో గొడవలు జరిగి వివాదం కొనసాగుతుంది.
ఈ క్రమంలో నిందితుడు సుధాకర్ కు ఫేస్బుక్ ద్వారా ఆంధ్ర కు చెందిన వెన్నదుర్గ వెంకటేష్ @ సాయి పరిచయమయ్యాడు. ఫేస్బుక్ పరిచయం కాస్త ఈ వివాదంలో నుండి బయటకు రావడానికి తన పెద్ద నాన్నను అంతమొందించేందుకు ఇరువురు స్కెచ్ వేశారు. తన పెదనాన్నను హత్య చేస్తే రెండున్నర లక్షల సుపారీ ఇస్తానని సుధాకర్ ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దీంతో సుధాకర్ పెదనాన్నను హతమార్చేందుకు కమ్మర్ పల్లి మండలం ఉప్పులూరు రోడ్డు వద్ద ఓ ఇంటి ముందు ఉన్న బైకు దొంగిలించి తిరిగి అదే బైక్ పై ఒడ్యాట్ గ్రామం మీదుగా మోర్తాడ్ గ్రామంలో ఉన్న సుధాకర్ పెదనాన్న ఇల్లు, పొలం చూసి తిరిగి వెళ్లారు. సుధాకర్ పెదనాన్నను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్న సమయంలో హతమార్చేందుకు గునపరాడ్ తో వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించారు.
దీంతో పోలీసుల విచారణలో సుఫారీ కి సంబంధించిన విషయం బయటకు వచ్చినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ ఎం.రాజశేఖర్ తెలిపారు. ఆస్తి కోసం హత్యయత్నానికి ప్రయత్నించిన సుధాకర్ , సాయి లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేశారు. దీంతో ఫేస్బుక్ స్నేహితులు కట కటాల పాలయ్యారు.