నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి కోరారు.
మంగళవారంనాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి,నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, కూరగాయలు, తదితర పంటలు దెబ్బ తిన్నాయని తెలిపారు.
ఈ మేరకు పంట నష్టాన్ని అధికార యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగు నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ కు విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తానని హామీని ఇచ్చినట్లు తెలిపారు.
