నిజామాబాద్ పురపాలక సంస్థకు చెందిన నాగారంలోని డంపింగ్ యార్డులో ఆదివారం మళ్ళీ అగ్గి రాజుకుంది. దీంతో డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు నిత్యాగ్నిహోత్రంలా మండుతూ కాలుష్య కుంపటిగా తయారైంది.
గత రెండు రోజుల క్రితం నగర శివారులోని నాగారంలోని డంపింగ్ యార్డు లో ప్రమాదవశాత్తుగా అగ్గి రాజుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డంపింగ్ యార్డు నుంచి మంటలు రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అగ్ని మాపకశాఖకు సమాచారం అందించారు.
దీంతో స్పందించిన అగ్ని మాపకశాఖ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ మేరకు తాజాగా ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ డంపింగ్ యార్డు మొత్తం మంటలు లేవడంతో సమీప ప్రాంతాల్లోనీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.డంపింగ్ యార్డులో మంటలు అంటుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు, అగ్ని మాపకశాఖ అధికారులు చల్లార్చేందుకు చర్యలు చేపట్టింది.
రెండు రోజులుగా అక్కడే ఉండి కార్మికులు, ఫైరింజన్లు, మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో డంపింగ్ యార్డులో మంటలు ఆర్పుతున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఒకచోట నీళ్ళు కొడితే మరో చోట మంటలు లేస్తున్నాయి.
వేడి గాలి వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది.తడి, పొడి వేరుచేయకుండానే…వాస్తవానికి ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయడంతోపాటు అందులోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను కూడా వేరు చేయాలి.
ఇలా వేరు చేసిన తడి చెత్తను కంపోస్ట్ కింద మార్చాలి. కానీ స్థానికంగా ఆ పని జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి డంప్ యార్డు చెత్తలో రబ్బరు, ప్లాస్టిక్, థర్మకోల్, ఫైబర్ మొదలైన పనికిరాని వస్తువులను వేరు చేయడంలేదంటున్నారు.
ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికులు..మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డులో చెత్త కాలుతున్న మంటలను అదుపులోకి తీసుకొని వాయు కాలుష్యం లేకుండా చూడాల్సిన అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
దీంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గల తండాలు, కాలనీలు, గ్రామాలే కాకుండా యార్డు పక్కనుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు డంపింగ్ యార్డు కాలిపోవడంతో వెలువడుతున్న దుర్వాసన పొగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.
ఈ కాలుష్యం వల్ల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలకు రోగాలు వచ్చి , ఇబ్బందులు ఎదురై , ప్రాణ నష్టం జరుగితే ఎవరు బాద్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
