డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహించిన సాయి చైతన్య నిజామాబాద్ సీపీగా ఇటీవల బదిలీ అయ్యారు. సోమవారం నూతన పోలిస్ కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చిన్న వయస్సులోనే చాలా మంది యువకులు మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితం పాడుచేసుకుంటున్నారని అన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దీనిపై జిల్లాలో ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకూ నార్కోటిక్ విభాగంలో లో తను ఎస్పీ గా విధులు నిర్వర్తించానని వాటిపై పూర్తి అవగాహన ఉందన్నారు.
అలాగే గతంలో ఉమ్మడి జిల్లాలో పలు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయనీ, అందుకు ఇకనుంచి మహిళల భద్రత,రక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు.
శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో రాజీపడేదే లేదని అన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, అర్బన్, రురల్ అని తేడా లేకుండా అమాయకులు మోసపోతున్నారని, సైబర్ నేరాల నివారణకు పోలీస్ శాఖ తరపున అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రజల సేవలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేసారు.
