స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి ప్రతీకగా ప్రారంభమైన సార్వజనిక గణేష్ ఉత్సవాలు.. ఎనిమిది దశాబ్దాలుగా నిజామాబాద్ నగరంలో సంప్రదాయంగా కొనసాగుతున్నాయి. పది మంది యువకులు దేశభక్తిని పెంపొందించాలనే సంకల్పంతో మొదలుపెట్టిన ఈ ఉత్సవాలు.. నేడు వేలాది మంది భక్తుల కన్నుల పండువగా తిలకించే మహా రథయాత్రగా రూపుదిద్దుకుంది.
ఏటా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే గణేష్ ఉత్సవాల్లో చివరి రోజు జరిగే రథయాత్రకు నగరంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నెల 25న(రేపు) శుక్రవారం దుబ్బలోని శ్రీ సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి మందిరం నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది.
దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ప్రజలను, ముఖ్యంగా యువతను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను ఓ వేదికగా మలిచారు. అదే స్ఫూర్తి నిజామాబాద్ యువతను ప్రభావితం చేసింది. పాలకుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా గణేష్ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించాలనే ఆలోచనతో స్థానికంగా కొందరు యువకులు ముందుకొచ్చారు.
ఈ క్రమంలో 1944లో సార్వజనిక గణేష్ మండలి వ్యవస్థాపక ట్రస్టును ఏర్పాటు చేశారు. కాశీనాథ్రావు ముప్కాల్, పి.నరసింహారావు, గంజుల పోశెట్టి, కిషన్‌దాస్, మురళీధర్ అటల్, మురళీధర్ శర్మ, మారుతిరావు పవర్, ముక్క చంద్రశేఖర్ గుప్తా, పాట్కూరి యెగొండ స్వామి, బాపూరావు బేర్కర్, బంటు రంచొడ్‌లాల్లు తదితరులు ఈ సంప్రదాయానికి పునాది వేశారు.
మొదట్లో నగరంలో ఐదారు ప్రాంతాల్లో మాత్రమే గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించేవారు. తొమ్మిది రోజుల అనంతరం ఆయా మండళ్లకు చెందిన యువకులు విగ్రహాలను చేతులపై మోసుకుంటూ సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఊరేగింపుగా నగర శివారుకు వెళ్లేవారు. అక్కడ వ్యవసాయ భూముల్లోని మోట బావుల్లో విగ్రహాలను నిమజ్జనం చేసేవారు.
కాలం మారేకొద్దీ నిమజ్జన ఊరేగింపులోనూ మార్పులు వచ్చాయి. దుబ్బ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తమ ఎడ్లబండ్లను అలంకరించి వాటిపై గణనాథుడిని తీసుకెళ్లడం ప్రారంభించారు. ఎడ్లబండ్లు సరిపోని పరిస్థితుల్లో అప్పట్లో అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్ ట్రాలీలను వినియోగించారు.
ఎడ్లబండి నుంచి భారీ రథం వరకు
రథయాత్రకు ప్రస్తుత రూపం రావడానికి కూడా దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రముఖ ఫర్టిలైజర్స్ సంస్థ ఆర్థిక సహకారంతో 1975లో చెక్కతో భారీ రథాన్ని తయారు చేయించారు. ఆ రథానికి ఎడ్లను కట్టి లాగుతూ గణనాథుడిని ఊరేగించే సంప్రదాయం కొనసాగింది.
కాలానుగుణంగా రథయాత్ర మరింత వైభవంగా మారింది. 2016లో సార్వజనిక గణేష్ మండలి నిర్వాహకులు విశాలమైన కొత్త రథాన్ని తయారు చేయించారు. ప్రస్తుతం అదే రథంపై గణనాథుడిని ఊరేగిస్తున్నారు. ఎనిమిది దశాబ్దాల చరిత్రకు ఈ రథయాత్ర సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
నగర పురవీధుల్లో రథయాత్ర
ఈ నెల 25న దుబ్బలోని శ్రీ సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి మందిరం నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. దుబ్బ నుంచి బయలుదేరే రథం రైల్వేగేటు మీదుగా గాంధీచౌక్, నెహ్రూపార్క్, పవన్ టాకీస్, గురుద్వార్, గాజుల్‌పేట్, గోల్‌హనుమాన్, పాటీగల్లి, పులాంగ్ మీదుగా సాగుతుంది. అనంతరం వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావి వద్ద గణనాథుడి నిమజ్జనం నిర్వహిస్తారు.
రథయాత్రను తిలకించేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రధాన కూడళ్ల వద్ద రథయాత్రను వీక్షించేందుకు ప్రజలు బారులు తీరడం ఏటా కనిపించే దృశ్యం.
ఎడ్ల జతల కోసం మహారాష్ట్ర వైపు చూపు
ఒకప్పుడు రథయాత్రలో 45 జతల ఎడ్లు పాల్గొనేవి. వ్యవసాయంలో ఎడ్లబండ్ల వినియోగం క్రమంగా తగ్గిపోవడంతో ప్రస్తుతం అవసరమైన సంఖ్యలో ఎడ్లను సమకూర్చుకోవడం నిర్వాహకులకు సవాలుగా మారింది. అయినప్పటికీ దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు పొరుగు మహారాష్ట్ర నుంచి 10 నుంచి 15 జతల ఎడ్లను అద్దెకు తీసుకొస్తున్నారు.
ఎడ్లబండి నుంచి ట్రాక్టర్ వరకు.. అక్కడి నుంచి భారీ రథం వరకు మారిన రథయాత్ర రూపం కాలానుగుణ మార్పులకు అద్దం పడుతున్నా.. గణనాథుడిని రథంపై ఊరేగించే సంప్రదాయం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.
పటిష్ఠ భద్రత మధ్య.. వైభవంగా నిమజ్జనం
రథయాత్ర సందర్భంగా పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, కీలక కూడళ్ల వద్ద బందోబస్తు తదితర చర్యలు చేపట్టనున్నారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో పది మంది యువకులు వేసిన అడుగు.. ఎనిమిది దశాబ్దాల్లో నిజామాబాద్ నగరానికి ఓ ప్రత్యేక సంప్రదాయంగా మారింది. ఈ నెల 25న(రేపు) మరోసారి అదే చరిత్రకు ప్రతీకగా గణనాథుడి రథం నగర పురవీధుల్లో కదలనుంది.
