రామడుగు ప్రాజెక్టు సాగునీటి కాల్వ కింద పంటలు పండిస్తున్న ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రాజెక్టు నుండి తమ గ్రామాలకు వచ్చే నీటిని చింతలూరు గ్రామస్తులు మళ్లిస్తున్నారని వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ, వాడి, భీంగల్ మండలం చేంగల్, బడా భీంగల్ గ్రామాలకు చెందిన రైతులు వందలాదిగా పెద్ద ఎత్తున చింతలూరు, వివాద స్థలం వద్దకు తరలివచ్చారు.
రామడుగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించే కాలువకు అక్రమంగా అడ్డుకట్ట వేసి , నీటిని చింతలూరు గ్రామ చెరువుకు మళ్ళిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
చింతలూరు గ్రామంలో మొత్తం ఐదు చెరువులు ఉండగా, సింగిడి చెరువులోకి రామడుగు నీరు మలిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని ఉద్దేశం చేత ఇటీవల తూము నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
అయితే తూము నుండి చెరువుకు నీటిని మళ్లించడానికి తవ్విన కాల్వ కోసం భూమి కోల్పోయిన ఇద్దరు రైతులకు సైతం చింతలూరు గ్రామస్తులు పరిహారం సైతం చెల్లించినట్లు సమాచారం.
ఇంతవరకు బాగానే ఉన్నా నీటిని మళ్లించడానికి సుమారు నాలుగు ఫీట్ల పైపులను వాడుతూ ఎక్కువ నీటిని తీసుకుంటారని ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది.
మరోపక్క సాగునీటి శాఖ అధికారుల సూచన మేరకు గ్రామాలకు నీటి వినియోగం జరగాల్సి ఉండగా, కనీస సమాచారం లేకుండానే అక్రమంగా అడ్డుకట్ట వేసి చింతలూరు గ్రామస్తులు అన్యాయం చేస్తున్నారని రైతులంటున్నారు.
సాగునీటి శాఖ అధికారులకు కనీస సమాచారం లేకుండానే నీటి మళ్లింపు జరుగుతున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న జక్రాన్ పల్లి పోలీసులు చింతలూరు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
అడ్డుకట్టను తొలగించే వరకు కదిలేది లేదని రైతులంటున్నారు. ఈ వివాదం పై చింతలూరు గ్రామస్తుల తీరు, ఎలా ఉంటుందో అని పలువురు అంటున్నారు.
ఇప్పటికైనా ఈ వివాదంలో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు
