అధికారం కోల్పోయాక భారత రాష్ట్ర సమితి సంస్థాగతంగా ప్రతికూల పరిస్థితులతో సతమతం అవుతుంది. అందుకే లోకసభ ఎన్నికలను సైతం సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయింది. పదేళ్ల పాటు నియోజకవర్గాల్లో పార్టీలో పాలన వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే లే ఇప్పుడు కారు పార్టీకి గుది బండగా మారారు.
అధికారం కోల్పోయాక మాజీ లు పార్టీ ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయాక నియోజకవర్గాల్లో పరిస్థితులను పట్టించుకోవడం లేదు.ఈ అయిదు మాసాల్లో ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్లారు. లోకసభ ఎన్నికల ను ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదనేది బహిరంగ రహస్యం. లోకసభ అభ్యర్థి గోవర్ధన్ కూడా మాజీ ఎమ్మెల్యే లను కాదని ఆయా నియోజకవర్గాల్లో కాలు పెట్టలేక పోయారు. జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గం ఉన్నాసరే బాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే లను కాదని ఎన్నికల మంత్రాంగం చేయలేక పోయారు.
లోకసభ ఎన్నికల పోలింగ్ తర్వాత రైతులకు బోనస్ ఇవ్వాలని ధాన్యం కొనుగోళ్లు పూర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల్లో ధర్నా లకు అధిష్టానం పిలుపు నిచ్చింది.జిల్లాలోని అయిదు సెగ్మెంట్ లలో బాజిరెడ్డి మినహా మాజీ ఎమ్మెల్యే లు అందరూ ఈ ఆందోళను లైట్ తీసుకున్నారు. ఎవ్వరూ పాల్గొనలేదు. ఒక్కో సెగ్మెంట్ లో డజన్ మంది నేతలు అరగంట హడావుడి చేసి వెళ్లిపోయారు.
నిజానికి మాజీ ఎమ్మెల్యే లెవ్వరూ సెగ్మెంట్ లలో క్రియాశీలకంగా పనిచేయడం లేదు.అందుకే కిందిస్థాయి లో నేతలు పార్టీ ని వీడుతున్నారు. నిజానికి లోకసభ ఎన్నికలను ఎలాగో పట్టించుకోలేదు కానీ రాబోయే లోకల్ బాడీ యంపిటిసి జెడ్పిటిసి మున్సిపల్ ఎన్నికల్లోనూ మాజీ ఇలాగే వుంటే పార్టీ క్షేత్ర స్థాయిలో కోలుకోలేని విధంగా నష్టపోతుందనే ఆందోళన క్యాడర్ బలంగా ఉంది.
అధినేత బస్సు యాత్ర తర్వాత క్యాడర్ లో కాస్తో కూస్తో జోష్ వచ్చినా మాజీ ఎమ్మెల్యే లు సానుకూలంగా మల్చుకోలేక పోయారు. క్రియాశీలకంగా పనిచేసే వారిని పురమాయించలేక పోయారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు ప్రచారం కు దూరంగా ఉండి పోయారు. అయినా మాజీ లు ఇవేవి లెక్క పెట్టలేదు. చెమటోడ్చి పనిచేస్తే గెలిచేది తాము కాదు కదా అనే ధోరణి మాజీ లో ఉండే .
అదే బాజిరెడ్డి కి శరాఘాతం అయింది. చివరికి పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ మాజీ ఎమ్మెల్యే లు ఉదాసీనంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతుంది. లోకసభ ఇంచార్జ్ గా ఉన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కేవలం బాల్కొండ కు పరిమితం అయ్యారు. తమ్ముళ్లు, తనయులు బంధువర్గమే నియోజకవర్గాల్లో చెలరేగిపోయారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ప్రస్థానం సాగిస్తున్న నేతలు సైతం నేరుగా ఎమ్మెల్యే లను కలసి సాధక బాధలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
అధినేత సైతం ఈ పదేళ్ల కాలం లో ఎమ్మెల్యే లు చెప్పిందే ఫైనల్ అని స్పష్టంగా సంకేతాలు ఇవ్వడంతో యదేచ్చగా చెలరేగిపోయారు. పార్టీ అధికారం కోల్పోయాక కూడా అధినేత వైఖరి మారక పోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా వారిని పట్టుకొని వేలాడితే పార్టీ ఎలా బలోపేతం అవుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది. పార్టీలో కొత్త తరం నాయకత్వం వచ్చేలా అధిష్టానం కార్యాచరణ ఆమలు చేయాలని చెప్తున్నారు